అధ్యాత్మ సంకీర్తన
రేకు: 218-5
సంపుటము: 3-100
రేకు: 218-5
సంపుటము: 3-100
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| పలువిచారములేల పరమాత్మ నీవు నాకు గలవు కలవు వున్నకడమ లేమిటికి | ॥పల్లవి॥ |
| నీ పాదముల చింత నిబిడమైతేఁ జాలు యే పాతకములైన నేమి సేసును యేపార నీ భక్తి ఇంత గలిగినఁ జాలు పైపై సిరు లచ్చటఁ బాదుకొని నిలుచు | ॥పలు॥ |
| సొరిది నీ శరణము చొచ్చితినంటేఁ జాలు కరుణించి యప్పుడట్టే కాతువు నీవు సరుస నీముద్రలు భుజములనుంటేఁ జాలు అరుదుగాఁ జేతనుండు అఖిలలోకములు | ॥పలు॥ |
| నేరక వేసినఁ జాలు నీ మీఁద నొకపువ్వు కోరిన కోరికలెల్లఁ గొనసాగును మేరతో శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలిచితి నేను యేరీతి నుండినఁ గాని యిన్నిటా ఘనుఁడను | ॥పలు॥ |


