అధ్యాత్మ సంకీర్తన
రేకు: 220-1
సంపుటము: 3-108
రేకు: 220-1
సంపుటము: 3-108
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| అయ్యో సదా మత్తుఁడను హరి నీ దాసులు నన్ను ఇయ్యెడనే దయఁజూచి యీడేర్చిరిఁ గాక | ॥పల్లవి॥ |
| తెగక కన్నులుమూసి దేహము మఱచేవాఁడ నిగిడి దేవుఁడవని నిన్నెరిఁగేనా తగఁ బసిఁడి చూచి నే ధర్మము మరచేవాఁడ జగతి విజ్ఞానము సరవెరిఁగేనా | ॥అయ్యో॥ |
| వలచి సతులనేటి వలలఁ బడేటివాఁడ మలసి తప్పించుక నీ మాయ దాఁటేనా వెలయ నన్నీఁ జదివి వివేకమొల్లనివాఁడ చలివాసి నీభక్తి చవిగొనేనా | ॥అయ్యో॥ |
| మించు సంసారము చొచ్చి మీఁదు దెలియనివాఁడ- నంచ నీ వంతర్యామివని మొక్కేనా యెంచక శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి మంచిదాయ నిఁక నిది మానబొయ్యేనా | ॥అయ్యో॥ |


