అధ్యాత్మ సంకీర్తన
రేకు: 19-3
సంపుటము: 1-115
రేకు: 19-3
సంపుటము: 1-115
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం[1]
| కూడు వండుట గంజికొరకా తనకు వేడుకలుగల సుఖము వెదకుటకుఁ గాక | ॥కూడు॥ |
| కుప్ప నురుచుట [2]కసవుకొరకా తనవు గొప్పయవు టిది మదముకొరకా వొప్పయిన వేడుకల నొరసి మనసు నెప్పునకు రాఁ దివియనేరవలెఁ గాక | ॥కూడు॥ |
| కొలుచు దంచుట పొట్టుకొరకా తాఁ గులజుఁడై మూఢుఁడౌ [3]కొరకా తలపోసి యిన్నింటఁ దగిలి మీఁదు తెలిసి సుఖదుఃఖములఁ దెలియవలెఁ [4]గాక | ॥కూడు॥ |
| కొండ దవ్వుట యెలుక కొరకా తాఁ గొండ యెక్కుట దిగుటకొరకా కొండలకోనేటిపతిఁ [5]గొలిచి [6]తనదు నిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక | ॥కూడు॥ |
[1] నిడురేకు 18- దేసాళం.
[2] నిడురేకు 18- వేయుట.
[3] నిడురేకు 18- కులజుఁడౌటిది చలము కొరకా.
[4] నిడురేకు 18- సులభంబైన తెరువుగనవలె.
[5] నిడురేకు 18- కొండకోనేటి.
[6] ‘తనకు’ అని పూ.ము.పా.


