అధ్యాత్మ సంకీర్తన
రేకు: 227-4
సంపుటము: 3-153
రేకు: 227-4
సంపుటము: 3-153
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| నానాటికిఁ బెరిగీని నరసింహము ఆనుక వరములిచ్చీ నౌభళపుసింహము | ॥పల్లవి॥ |
| వేఁడి ప్రతాపముతోడ విభవాలు మెరయుచు మూఁడుమూర్తు లొక్కటైన ముఖ్యసింహము వాఁడివాఁడి కోరలతో వడి నసురఁ జక్కాడి తీఁడేటి మీసాలతోడి దేవదేవసింహము | ॥నానా॥ |
| సరుస శంఖచక్రాది సకలాయుధాలు వట్టి పరబ్రహ్మమే తానైన పటుసింహము వరుసఁ గొలువులు దేవతలెల్లాఁ జేయఁగాను తిరమైన కృపతోడి దివ్యసింహము | ॥నానా॥ |
| కేలి సింహాసనముపై కిరీటము ధరియించి చాలు వేయిచేతుల కాంచనసింహము పాలించి ప్రహ్లాదుని భక్తుల పాలిటి కిలు- వేలుపై శ్రీసతితో శ్రీవేంకటాద్రి సింహము | ॥నానా॥ |


