Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 20-1
సంపుటము: 1-119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
తోరణములే దోవెల్లా
మూరట బారట ముంచిన లతల
॥తోరణ॥
కూరిమి మటములు గోపురంబులును
తేరుపడగెలే తెరువెల్లా
కోరిన పండ్లు గురిసేటి తరువులు
తోరములైన వెదురు జొంపములు
॥తోరణ॥
ఆటలుఁ దిరుపులు నందపు టురుపులు
పాటలు వనవైభవమెల్లా
కూటువ [1]నెమళ్ళ కోవిల [2]గుంపుల
పేటలఁ దేటల పెనుఁగూటములు
॥తోరణ॥
వింజామరలును విసనకఱ్ఱలును
గొంజెగొడుగులే కొండెల్లా
అంజనగిరిరాయఁడు వేంకటపతి
సంజీవని పరుషల కొదవఁగను
॥తోరణ॥

[1] ‘నెమళ్ళు’

[2] ‘గుంపులు’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము