అధ్యాత్మ సంకీర్తన
రేకు: 228-6
సంపుటము: 3-161
రేకు: 228-6
సంపుటము: 3-161
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| పైకొని చూడరో వుట్లపండుగ నేఁడు ఆకడ గొల్లెతలకు నానందము నేఁడు | ॥పల్లవి॥ |
| ఆదికాలమునఁ గృష్ణు డవతరించినయట్టి- ఆదట శ్రావణ బహుళాష్టమాయను దాదాత రోహిణినక్షత్రము గూడె నడురేయి సాదించ లోకులకెల్లా జయంతియాయను | ॥పైకొ॥ |
| వసుదేవునిని దేవకిని మన్నించి కృష్ణుఁ- డెసఁగి రేపల్లెకు నేతెంచుటాయను కొసరి యశోదా నందగోపులకుఁ బుత్రోత్సవ- మసమున నిచ్చి మించె నన్నిటా మేలాయను | ॥పైకొ॥ |
| తొట్టిన రాకాసులతోడఁ గూడ భువిమీఁద నట్టె కంసుని మదము హతమాయను రట్టడి శ్రీవేంకటేశుఁ డిట్టె వీధుల నెల్ల జట్టిగా మెరసే యట్టి సంభ్రమములాయను | ॥పైకొ॥ |


