Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-6
సంపుటము: 1-12
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
సందడి విడువుము సాసముఖా
మంధరధరునకు మజ్జనవేళా
॥పల్లవి॥
అమరాధిపు లిడుఁ డాలవట్టములు
కమలజ పట్టుము కాళాంజి
జమలిచామరలు చంద్రుఁడ సూర్యుఁడ
అమర నిడుఁడు పరమాత్మునకు
॥సందడి॥
అణిమాదిసిరులనలరెడు శేషుఁడ
మణిపాదుక లిడు మతి చెలఁగా
ప్రణుతింపు కదిసి భారతీరమణ
గుణాధిపు మరుగురు బలుమరును
॥సందడి॥
వేదఘోషణము విడువక సేయుఁడు
ఆదిమునులు నిత్యాధికులు
శ్రీదేవుండగు శ్రీవేంకటపతి
ఆదరమున సిరు లందీ వాఁడె
॥సందడి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము