Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 20-2
సంపుటము: 1-120
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
[1]బాపు దైవమా మా పాలి భవమా
తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం
॥బాపు॥
కాలనేమి పునుకిది కంచువలె లెస్స వాఁగీ
తాళమొత్తరే తత్త తత తత్తత్త[2]
కాలమెల్ల మాభూతగణమెల్ల వీఁడె కాచె
నేలఁబడి నేఁడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం[3]
॥బాపు॥
పగగొని మానక[4] పచ్చినెత్తు రెప్పుడును
తెగి కొనుఁ దానె తిత్తి తిత్తి [5]తిత్తితి
తగు మహోదరు వీఁపు దణధణమని వాఁగీ
బిగియుంచరే తోలు బింభిం బింభిం బింభింభిం
॥బాపు॥
మురదనుజుని పెద్దమొదలి యెముకఁ దీసి
తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు[6]
తిరువేంకటగిరిదేవుఁడు గెలిచిన స-
మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ
॥బాపు॥

[1] ఈపాట అన్నమయ్య భక్తి శివమెత్తి వ్రాసినట్లున్నది.

[2] నిడురేకు 120- తత్తత తత్తతా.

[3] నిడురేకు 120- ధిం.

[4] నిడురేకు 120- మాకిందు.

[5] నిడురేకు 120-తిత్తి. (ఇందు రెండవ చరణమున పూర్వోత్తరార్థములు వ్యత్యస్తములు).

[6] నిడురేకు 120- తుత్తుతూ.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము