అధ్యాత్మ సంకీర్తన
రేకు: 230-5
సంపుటము: 3-172
రేకు: 230-5
సంపుటము: 3-172
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| హరి నిను నెరఁగని యలమటలింతే శాయ శరణంటి నిదె నీకే సర్వేశ కావవే | ॥పల్లవి॥ |
| చొచ్చితి స్వర్గము దొల్లి సుకృతములెల్లాఁ జేసి ఇచ్చఁ గొలిచితి సుర లిందరిని గచ్చులఁ బుణ్యము దీరఁ గమ్మటి జన్మములకే వచ్చితి పురుషార్థము వడి నెందూ గానను | ॥హరి॥ |
| వెదకితి భూములెల్ల విశ్వకర్తెవ్వడో యంటా చదివితిఁ బుస్తకాలు సారెసారెకు తుద ననుమానమున దొమ్మి నీకలు దెల్లఁగా ముదిసితి నింతేకాని ముందరేమీఁ గానను | ॥హరి॥ |
| చింతలెల్ల నుడిగితి శ్రీవేంకటేశ్వర నిన్ను వింత లేక శరణని వెలసితిని చెంతల నిన్నాళ్లదాఁకా చిక్కి కర్మముల వట్టి గంతులు వేసితిఁగాని కడ గాననైతిని | ॥హరి॥ |


