అధ్యాత్మ సంకీర్తన
రేకు: 230-6
సంపుటము: 3-173
రేకు: 230-6
సంపుటము: 3-173
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| నీకు నాకు నెట్టుగూడె నీ వెట్టు నన్నేలితివి యీ కరుణకే మొక్కితి నిందిరారమణా | ॥పల్లవి॥ |
| కమలాక్ష నీ వనంతకల్యాణగుణనిధివి అమితదుర్గుణరాసి నన్నిటా నేను అమరఁగ స్వతంత్రుఁడ వటు నిన్ను నెంచితేను తమి నించుకంతా స్వతంత్రుఁడ నేఁ గాను | ॥నీకు॥ |
| దేవ నీవైతే సర్వదేవరక్షకుఁడవు నే జీవుఁడ నింద్రియాలఁ బెంచేవాఁడను ఆవల బ్రహ్మాండాల కన్నిటాఁ బొడవు నీవు భావించ నేనణువై పరగేటివాఁడను | ॥నీకు॥ |
| నానార్థసంపన్నుఁడవు నావల్ల నేమి గంటివి ఆనుక నా యంతర్యామివై పాయవు శ్రీనిధివి నీవైతే శ్రీవేంకటాద్రిపతివి దీనుఁడ నొకఁడ నేను ద్రిష్టించి కాచితివి | ॥నీకు॥ |


