అధ్యాత్మ సంకీర్తన
రేకు: 231-1
సంపుటము: 3-174
రేకు: 231-1
సంపుటము: 3-174
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| వెఱ్ఱి దెలిసి రోఁకలి వెసఁ జుట్టుకొన్నట్టు యిఱ్ఱి దీముభోగముల నెనసేము | ॥పల్లవి॥ |
| మురికిదేహము మోచి మూలల సిగ్గుపడక పొరిఁ బరిమళములు పూసేము పరగ పునుకతల పావనము సేసేమంటా నిరతితోడ దినము నీట ముంచేము | ॥వెఱ్ఱి॥ |
| పుక్కట పంచేంద్రియపు పుట్టు వుట్టి యందరిలో మొక్కించుక దొరలమై మురిసేము అక్కర నజ్ఞానమనే అంధకారమున నుండి దిక్కుల నెదిరివారిఁ దెలిపేము | ॥వెఱ్ఱి॥ |
| దినసంసారమే మాకు దేవుఁడని కొలుచుక వెనుకొని ఘనము క్తి వెదకేము యెనలేక శ్రీవేంకటేశ మమ్ముఁ గావఁగాను తనిసి తొల్లిటిపాటు దలఁచేము | ॥వెఱ్ఱి॥ |


