అధ్యాత్మ సంకీర్తన
రేకు: 232-6
సంపుటము: 3-185
రేకు: 232-6
సంపుటము: 3-185
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| కని గుడ్డును నదె విని చెవుడును నిదె ననిచి జగత్తు నడచీనదివో | ॥పల్లవి॥ |
| వుదయాస్తమయము లొకదినముననే యెదుటనె వున్నవి యెంచినను యిదివో జీవులు యెంచక తమతమ- బ్రదుకులు సతమని భ్రమసెదరు | ॥కని॥ |
| వెలుఁగును జీఁకటి వెసఁ గనుఁగొనలనె నిలిచీ నూరక నిమిషములో కలవలెనుండిన గతి సంసారము బలువుగ సతమని భ్రమసెదరు | ॥కని॥ |
| కాంతలుఁ బురుషులు కాయ మొక్కటనె పొంతనే పుట్టుచుఁ బొదలెదరు యింతయు శ్రీవేంకటేశ్వరు మహిమలఁ పంతము దెలియక భ్రమసెదరు | ॥కని॥ |


