అధ్యాత్మ సంకీర్తన
రేకు: 233-5
సంపుటము: 3-190
రేకు: 233-5
సంపుటము: 3-190
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఓపితేఁ దానే తగిలి వోపకున్నఁ దానే మాని మాపురేపు నలయించే మాయ మాకేలా | ॥పల్లవి॥ |
| చింతాయకుఁడగు(?) హరి చిత్తములో నుండఁగాను వింతవింత విచారాల వెఱ్ఱి మాకేలా చెంతల పరుసవేది చేతిలోనే వుండఁగాను దొంతరవిద్యలతోడి దోవ మాకేలా | ॥ఓపి॥ |
| తోడునీడై యచ్యుతుఁడు తొలఁగక వుండఁగాను జాడ దప్పి తిరిగేటి జాలి మా కేలా యేడనో కోకలు వేసి యేమియు నెరఁగలేక వేడుకతో కొక్కెరాలవెంట మాకేలా | ॥ఓపి॥ |
| వెల్లవిరై యెదుట శ్రీవేంకటేశుఁ డుండఁగాను బల్లిదుఁ డీతనిఁ బాసి భ్రమ మాకేలా యెల్ల ధాన్యములు మా యింటిలో నుండఁగాను పొల్లి కట్టు దంచేమని బుద్ధి మాకేలా | ॥ఓపి॥ |


