Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 233-6
సంపుటము: 3-191
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
మాకేమి నీకరుణ మహాప్రసాద మనేము
నీకు నీ దాసుల చేతినింద బెట్టుగాదా
॥పల్లవి॥
పమ్మి మిమ్ముఁ గొలిచినబంట్లఁ బరులు దమ
సొమ్మనుచుఁ దియ్యగాఁ జూచేదా
వుమ్మడి నీవిందుకెల్లా నూరకున్నఁగన మిమ్ము
నమ్ముమన్న వేదాలయానతి కొంచెపడదా
॥మాకే॥
నీముద్ర మోచినవారి నీచులు దడవఁగాను
యీమేర నడ్డమురాక యిట్లుండేదా
వోమక నీవీవేళ నూరకున్న నల్లనాఁటి-
సామజముఁ గాచినది సందేహించఁబడదా
॥మాకే॥
మీరు మన్నించినవారు మీవాకిలి గావ కేడో-
వారి వాకిలి గావఁగా వద్దనరాదా
నేరిచి శ్రీవేంకటేశ నేఁడు నన్నుఁ గావకున్న
ధారుణి మీ దయే మిమ్ముఁ దప్పులెంచుకొనదా
॥మాకే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము