అధ్యాత్మ సంకీర్తన
రేకు: 234-4
సంపుటము: 3-195
రేకు: 234-4
సంపుటము: 3-195
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇందుకే కాలమందే యీతని శరణంటిమి ముందుముందే దయఁజూచి మొగిఁ గాచుఁగాక | ॥పల్లవి॥ |
| పుడమి గుంగిన నెత్తె పురుషోత్తముఁ డితఁడు యెడసి కొండ గుంగితే నెత్తె నితఁడు అడరి సంసారవార్ధి నడఁగిన దాసులను యిడుములఁ బొందకుండా యెత్తి కాచుఁగాక | ॥ఇందు॥ |
| పట్టి ప్రహ్లాదు బాధలు పాపిన దేవుఁ డితఁడు రెట్టిగా వేదము లుద్ధరించె నితఁడు వట్టి దుష్టులలో సహవాసమైతే దాసులను దిట్టయై వెళ్లఁదీసి తా దిక్కై కాచుఁగాక | ॥ఇందు॥ |
| లంకలో సీతఁ దెచ్చిన లావరి తానే యితఁడు మంకు అహల్యశాపము మాన్పె నితఁడు అంకెల శ్రీవేంకటేశుఁ డతిభీతిఁ బాపి మమ్ము గొంకక తన దాసులఁ గూడి కాచుఁగాక | ॥ఇందు॥ |


