Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 20-5
సంపుటము: 1-123
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
ఏమో తెలిసెఁ గాని యీజీవుఁడు
నేమంపు నెరవిద్య నేరఁడాయ
॥ఏమో॥
కపటాలె నేరిచెఁగానీ జీవుఁడు
యెపుడైనా నిజసుఖ మెఱఁగఁడాయ
కపురులే చవిగొనెఁగానీ జీవుఁడు
అపరిమితామృత మానఁడాయ
॥ఏమో॥
కడలనే తిరిగీఁగానీ జీవుఁడు
నడుము మొదలుఁ జూచి నడవఁడాయ
కడుపుకూటికే పోయీఁగానీ జీవుఁడు
చెడని జీతము పొంతఁ జేరఁడాయ
॥ఏమో॥
కనియుఁ గానకపోయఁ గానీ జీవుఁడు
దినము వేంకటపతిఁ దెలియఁడాయ
కనుమాయలనె చొక్కెఁగానీ జీవుఁడు
తనియ నిట్టే మంచిదరిఁ జేరఁడాయ
॥ఏమో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము