అధ్యాత్మ సంకీర్తన
రేకు: 235-6
సంపుటము: 3-203
రేకు: 235-6
సంపుటము: 3-203
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తెగక పరమునకుఁ దెరువు లేదు పగయెల్లా విడువక భవమూఁ బోదు | ॥పల్లవి॥ |
| కన్నుల యెదుటనున్న కాంచనముపై మమత వున్నంతదడవు మోక్ష మొనగూడదు అన్నముతోడి రుచుల యలమట గలదాఁకా పన్నిన సుజ్ఞానము పదిలము గాదు | ॥తెగ॥ |
| పక్కనున్న కాంతల భ్రమగల కాలము మిక్కిలి శ్రీహరిభక్తి మెరయలేదు వెక్కసపు సంసారవిధి నున్నంతదడవు నిక్కి పరమధర్మము నిలుకడ గాదు | ॥తెగ॥ |
| చిత్తము లోపలి పలుచింతలు మానినదాఁకా సత్తుగా వైరాగ్యము సమకూడదు యిత్తల శ్రీవేంకటేశుఁ డేలిన దాసులకైతే హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు | ॥తెగ॥ |


