Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 240-4
సంపుటము: 3-230
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఏకాలము నామనే యెరిఁగిన దాసులకు
దాకొని శ్రీహరి భక్తిధారణ గలిగితేను
॥పల్లవి॥
తొడుకు మేయఁగరాదు తూర్పెత్తితేఁ బొల్లువోదు
బడినే శ్రీహరిభక్తి పంట పండితే
వుడివోదేకాలము వొకతతి రావద్దు (?)
చెడని శ్రీహరిభక్తి చెట్టుకట్టితేను
॥ఏకా॥
వలువ దీసితేఁ బోదు వాడుకొంటే వెల్తి గాదు
కొలచి శ్రీహరిభక్తి కుప్ప చేసితే
యెలుకకుఁ దినరాదు యెన్నాళ్లున్నాఁ జివుకదు
తలఁచి హరిభక్తి చిత్తపుగాదెఁ బెట్టితే
॥ఏకా॥
కఱవుకుఁ లోఁగాదు సుంకరవాని కబ్బదు
యెఱుకతో హరిభక్తి యిల్లు నిండితే
నెఱవై శ్రీవేంకటేశ నీకృపగలవారికి
గుఱిగాఁగ హరిభక్తి కూడపెట్టుకొంటేను
॥ఏకా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము