అధ్యాత్మ సంకీర్తన
రేకు: 252-1
సంపుటము: 3-296
రేకు: 252-1
సంపుటము: 3-296
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| ఇన్నిటి మూలం బీశ్వరుఁ డాతని- మన్నన కొలఁదినె మలయుటఁ గాక | ॥పల్లవి॥ |
| మాయామయమై మనియెడి జగమిది చాయల నిందు నిజము గలదా కాయము సుఖదుఃఖములకుఁ బొత్తిది రేయిఁబగలు నొకరీతే కలదా | ॥ఇన్ని॥ |
| దైవాధీనము తగు సంసారము వావిరి జీవుల వసమవునా ధావతి మనసిది తన కర్మమూలము వేవేలై నా విడువఁగ వశమా | ॥ఇన్ని॥ |
| పంచేంద్రియములఁ బరగేటి బ్రదుకిది చంచలంబు నిశ్చలమవునా యెంచఁగ శ్రీవేంకటేశ్వరు కృపతో సంచయమయితే సతమవుఁగాక | ॥ఇన్ని॥ |


