అధ్యాత్మ సంకీర్తన
రేకు: 253-5
సంపుటము: 3-306
రేకు: 253-5
సంపుటము: 3-306
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక ప్రతిలేదితనికి జీవకోట్లకుఁ బ్రాణబంధుఁ డితఁడు | ॥పల్లవి॥ |
| ముందు నేను ఘనగర్భనరకమున మునిఁగియున్ననాఁడు బొందితోడనే సుఖదుఃఖంబులఁ బొరయు తోడునీడితఁడు అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడఁ దా వెనువెంటనే చందపు నాయాతుమలోఁ బాయని సర్వాత్మకుఁ డితడే | ॥ఇత॥ |
| ఆని పట్టి నేఁ బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు మానుపనొల్లఁడు తాఁ బెరరేఁచును మతి కనుకూలం బితఁడు నానావిధులనుఁ బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు తానును ఆపరిణామంబులకు తగులైవుండును యీతఁడు | ॥ఇత॥ |
| తలఁచిన దగ్గరుఁ దడవక యుండిన దవ్వయివుండు నితఁడు కలసి మెలసి ఇహపరము లొసంగఁగఁ గాచుకవుండును యీతఁడు మెలఁగుచు సాకారముతో నున్నాఁడు మేటిశ్రీవేంకటపతి యీతఁడు వలసిన వావులరూపులు దాల్చినవాఁ డొకఁడేపో యీతఁడు | ॥ఇత॥ |


