అధ్యాత్మ సంకీర్తన
రేకు: 256-3
సంపుటము: 3-322
రేకు: 256-3
సంపుటము: 3-322
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| భక్తి నీపైదొకటె పరమసుఖము యుక్తి చూచిన నిజంబొక్కటే లేదు | ॥పల్లవి॥ |
| కులమెంత గలిగె నది కూడించు గర్వంబు చలమెంత గలిగె నది జగడమే రేఁచు తలఁపెంత పెంచినాఁ దగిలించు కోరికలు యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు | ॥భక్తి॥ |
| ధన మెంత గలిగె నది దట్టమౌ లోభంబు మొనయుఁ జక్కందనంబు మోహములు రేఁచు ఘనవిద్య గలిగినను కప్పుఁ బైపై మదము యెనయఁగఁ బరమపద మించుకయు లేదు | ॥భక్తి॥ |
| తరుణు లెందరుఅయిన తాపములు సమకూడు సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు యిరవయిన శ్రీవేంకటేశ నినుఁ గొలువఁగా పెరిగె నానందంబు బెళకు లిఁకలేవు | ॥భక్తి॥ |


