అధ్యాత్మ సంకీర్తన
రేకు: 264-3
సంపుటము: 3-369
రేకు: 264-3
సంపుటము: 3-369
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎంత విచారించుకొన్నా నిదియే తత్త్వము హరి వంతుకు నీ కృపగలవాఁడే యెరుఁగు హరి | ॥పల్లవి॥ |
| నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి నిన్ను నొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి మున్ను దేవతలు నీకు మ్రొక్కి బ్రదికిరి హరి వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి | ॥ఎంత॥ |
| యేపున నీ పేరిటివాఁ డిన్నిటా ధన్యుఁడు హరి నీ పేరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడు హరి కేపుల నిన్ను నుతించి గెలిచె నారదుఁడు హరి పైపై నిన్నుఁదిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి | ॥ఎంత॥ |
| యిట్టే నీవిచ్చిన వరమెన్నఁడుఁ జెడదు హరి గట్టిగ నీవియ్యనివి కపటములే హరి అట్టె శ్రీవేంకటేశుఁడ వంతరంగుఁడవు హరి వుట్టివడి కానకున్న వొచ్చెము దేహికి హరి | ॥ఎంత॥ |


