అధ్యాత్మ సంకీర్తన
రేకు: 268-5
సంపుటము: 3-393
రేకు: 268-5
సంపుటము: 3-393
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు కందర్పజనక నాకుఁ గలిగితి విన్నిటా | ॥పల్లవి॥ |
| ఘనకుండలములు నీ కథలు నాచెవులకు ననుపైన రుచులు నీ నామములు నాలుకకు అనువై నీకు మొక్కఁగ నంటిన నొసలిమన్ను పనివడి నీకు పట్టబద్ధ(ంధ?)ము | ॥అంది॥ |
| మంచి నిర్మాల్యపుదండ మంగళసూత్రము నాకు కాంచనపురాసి నీ చక్కని రూపు నామతికి పంచామృతములు నీ పాదతీర్థము మేనికి పంచినముద్ర లదే వజ్రాంగిజోడు | ॥అంది॥ |
| సకలబంధులు నీ దాసానదాసులే నాకు అకలంక జన్మఫల మన్నిటా నీకృప నాకు ప్రకటపు శ్రీవేంకటపతివి నాయాతుమలో మొకరివై యుండి నన్ను మోహించఁజేసితివి | ॥అంది॥ |


