Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 270-5
సంపుటము: 3-405
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
రుచులు నే నిటు గొనని వేడవి రోఁతలయ్యెడిఁ గాక నేఁడు
వచనముల హరి నీకు శరణని వసుధఁ బావనమైతిఁ గాక
॥పల్లవి॥
నేను సేయని పాపమేడది నిఖిలలోకములందును
నేను చొరని నరకమేడది నెఱయ దుర్గతుల
నేను పొడమని యోనులేడవి నిఖిలజంతువులందును
పూని హరి నిను శరణుచొరఁగాఁ బుణ్యుఁగాఁ జేసితివిఁ గాక
॥రుచు॥
నిరతి నాడని కల్లలేడవి నేను నాలుక తుదలయందును
పొరలి నడపని కర్మమేడది భువి ననాచారములలో
తిరిగి తిరిగి నీచులిండ్లను తిరియనర్థము లింకనేడవి
గరిమ హరి నే నిన్ను శరణనఁగాను ఘనుఁ జేసితివిఁ గాక
॥రుచు॥
తలఁప నజ్ఞానములు నపరాధములు నాయెడ లేనివేడవి
యెలిమి నన్నిట్లేలఁ దగునా యేలితివిఁ గాక
నిలిచి శ్రీవేంకటగిరీశ్వర నీకు శరణనుమాత్ర మింతే
కలసి నాయెడనేమి గంటివి కాచితివి భువనములలోను
॥రుచు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము