అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-2
సంపుటము: 1-163
రేకు: 27-2
సంపుటము: 1-163
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| [1]ఆటవారిఁ గూడితౌరా ఆటవారిఁ గూడి అన్నిచోట్ల బొమ్మ- లాట లాడించ నధికుండవైతివి | ॥ఆట॥ |
| గురుతరమగు పెద్దకొట్టాములోపల తిరుమైన పెనుమాయఁ దెరగట్టి అరయ నజ్ఞానము లవి యడ్డముగఁ జేసి పరగ సుజ్ఞానదీపములు ముట్టించి | ॥ఆట॥ |
| తోలుబొమ్మల దొరకొని గడియించి గాలిచేత వానిఁ గదలించి తూలేటి రసములు తొమ్మిది గడియించి నాలుగు ముఖముల నలువున నాడించ | ॥ఆట॥ |
| నిన్నే మెత్తురుగాని నీకేమి నీలేరు మన్నించు దాతలు మరిలేరు యెన్నఁగఁ దిరువేంకటేశ్వర నీదాసు - లున్నతులై నిన్ను నుబ్బించి పొగడఁగ | ॥ఆట॥ |
[1] ఈ పల్లవి మూడు పాదములుగా నున్నది.


