Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-5
సంపుటము: 1-166
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇన్నిలాగుల చేతు లివియ పో కడు-
నెన్నికకెక్కిన చేతు లివియ పో
॥ఇన్ని॥
గునియుచుఁ దను నెత్తుకొమ్మని తల్లిపై
నెనయఁ జాఁచిన చేతు లివియ పో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన
యినుమువంటి చేతు లివియ పో
॥ఇన్ని॥
పిసికి పూతకి చన్ను బిగియించి పట్టిన
యిసుమంతలు చేతు లివియ పో
పసులఁ గాచుచు గొల్లపడుచుల యమునలో
యిసుక చల్లిన చేతు లివియ పో
॥ఇన్ని॥
పరమచైతన్యమై ప్రాణుల కెల్లను
యెరవులిచ్చిన చేతు లివియ పో
తిరువేంకటగిరిదేవుఁడై ముక్తికి
నిరవు చూపెడు చేతు లివియ పో
॥ఇన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము