Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 27-6
సంపుటము: 1-167
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
వాసివంతు విడిచినవాఁడే యోగి, యీ
ఆసలెల్లా విడిచిన అతఁడే యోగి
॥వాసి॥
గద్దించి పారెడు తురగమువంటి మనసు
వద్దని మరలించినవాఁడే యోగి
వొద్దనే కొండలవంటి వున్నత దేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాఁడే ధీరుఁడైన యోగి
॥వాసి॥
ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
వంచన మునుఁగనట్టివాఁడే యోగి
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు
దంచి పారఁజల్లువాఁడే తత్త్వమైన యోగి
॥వాసి॥
వెగటుకామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై
వగలుడిగినయట్టివాఁడే యోగి
నిగిడి శ్రీవేంకటపతి నిజదాసుఁడై భక్తిఁ
దగిలి నిలుపువాఁడే ధన్యుఁడైన యోగి
॥వాసి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము