Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-1
సంపుటము: 1-169
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
తొలుఁ బాపపుణ్యాలతోడఁ బుట్టితినట
బలువైన భవములఁ బడలేనా
॥తొలు॥
గాముల యింటనే కాఁపనయితినట
పాముపుట్టనుండియైన బతుకలేనా
గోమున హేయపుఁ గుండకూడు నించితినట
గామిడి [1]నేగారేతిత్తిఁ గానోపనా
॥తొలు॥
కట్టైన గుణములచే కట్టువడితినట
చుట్టపు బంధాలరొచ్చుకు నోపనా
దట్టపుటాసల నేఁ దాల్చితినట నా
వెట్టకాయము మోవ వెఱచేనా
॥తొలు॥
[2]నిగిడిన లోపల నీ వుండుదట
పగవారికి నేఁ బగిలేనా
తగువేంకటేశ నీదయవాఁడనట యీ
వగల నిన్నిఁట గెలువఁగలేనా
॥తొలు॥

[1] ‘నేగారేతిత్తిఁ’ =నేయిగారుతిత్తిని కావచ్చు.

[2] ‘నిగిడి నాలోపల’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము