Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-4
సంపుటము: 1-17
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
నీవే కానింక నే నన్యమెఱఁగ యే
త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య
॥నీవే॥
అపరాధశతకోట్లయినవి వొక్క
నెపమున ననుఁ గావనేరవా
అపరిమితదురితాలైనవి యే
ఉపమచేత నన్ను నుద్ధరించెదవయ్య
॥నీవే॥
అతిశయముగఁ గర్మినైతిని నీ
మతము నాకొక యింత మరపవా
ఇతర కర్మారంభహితుఁడను
గతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య
॥నీవే॥
తిరువేంకటాచలాధీశ్వరా నీ
శరణాగతులఁ బ్రోవఁజాలవా
పరమదయానందపరుఁడవు యే
వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య
॥నీవే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము