Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-2
సంపుటము: 1-170
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
[1]ఈతఁ డఖిలంబునకు నీశ్వరుఁడై సకల-
భూతములలోనఁ దాఁ బొదలువాఁడితఁడు
॥ఈతఁడ॥
గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁద
చూపట్టు కమ్మఁగస్తూరి పూఁత యితఁడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితఁడు
॥ఈతఁడ॥
జలధికన్యాపాంగలలితేక్షణములలో
కలసి వెలుఁగుచునున్న కజ్జలం బితఁడు
జలజాసనుని వదనజలధి మధ్యమునందు
అలర వెలువడిన పరమామృతం బితఁడు
॥ఈతఁడ॥
పరివోని సురత సంపదల నింపులచేత
వరవధూతతికి పరవశ[2]మైన యితఁడు
తిరువేంకటాచలాధిపుఁడు దానె యుండి
పరిపాలనము సేయ ధారకుండితఁడు
॥ఈతఁడ॥

[1] ‘ఏతదఖిలంబు’ పూ.ము.పా. ఇది మంచిది కావచ్చు. రేకుపాఠము చూపి మనపాఠము లిచ్చుట మంచిదిగదా?

[2] ‘మైనదిత’ పూ.ము.పా. ఇది మంచిది కావచ్చు. రేకుపాఠము చూపి మనపాఠము లిచ్చుట మంచిదిగదా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము