అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-3
సంపుటము: 1-171
రేకు: 28-3
సంపుటము: 1-171
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎన్నఁగలుగు భూతకోటినెల్లఁ జేసినట్టి చేఁత నిన్నుఁ జేసుకొనుట గాక నీకుఁ దొలఁగవచ్చునా | ॥ఎన్న॥ |
| గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు కట్టివేసినట్టి పాపకర్మ మేల తీరును పట్టితెచ్చి నిన్ను రోలఁగట్టివేసి లోకమెఱఁగ రట్టు సేసుఁ గాక నిన్ను [1]రాజనన్న విడుచునా | ॥ఎన్న॥ |
| మిఱ్ఱుపల్లములకుఁ దెచ్చి మెరసి భూతజాలములకుఁ దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును అఱ్ఱుసాఁచి గోపసతుల నలమి వెంటవెంటఁ దిరుగ వెఱ్ఱిఁ జేయుఁ గాక నీవు విభుఁడనన్న విడుచునా | ॥ఎన్న॥ |
| పరుల ఇంటి కేఁగి పరుల పరుల వేఁడఁజేసినట్టి [2]యెరుకమాలినట్టి చేఁత లేల నిన్ను విడుచును వెరపు మిగిలి వేంకటాద్రివిభుఁడ ననుచు జనులచేత నరులు గొనఁగఁజేయుఁ గాక ఆస నిన్ను విడుచునా | ॥ఎన్న॥ |
[1] ‘రాజవన్న’ రేకు.
[2] ‘యెఱుక’ పూ.ము.పా.


