Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-4
సంపుటము: 1-172
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను
యేమరక కొలిచిన నీతఁడే దైవము
॥ఏమి॥
ఘనముగా నిందరికిఁ గన్నులిచ్చుఁ గాళ్లిచ్చు
పని సేయఁ జేతులిచ్చు బలియుఁడై
తనుఁ గొలువుమని చిత్తములిచ్చుఁ గరుణించి
వొనర లోకానకెల్ల నొక్కఁడే దైవము
॥ఏమి॥
మచ్చిక తనుఁ గొలువ మనసిచ్చు మాటలిచ్చు
కుచ్చితములేని కొడుకుల నిచ్చును
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు
నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము
॥ఏమి॥
పంతమాడి కొలిచినఁ బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు
యెంతటి పదవులైన నిట్టె యిచ్చు
వింతవింత విభవాల వేంకటేశుఁడిదె మా
యంతరంగమున నుండే అరచేతి దైవము
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము