Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 28-5
సంపుటము: 1-173
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
వెట్టిమోపువంటి మేను విడనాడి వీఁ-
డిట్టె దాఁటిపోయె నెటువంటి జాణే
॥వెట్టి॥
ఘోరమైన ఆసలనెడి కూఁకటవేరు దవ్వి
పారవేసి యిడుమలఁ బడనొల్లక
యీరసపు సంసార మింగలము దగిలించి
యేరు దాఁటిపోయె నెటువంటి జాణే
॥వెట్టి॥
కన్నవారిఁ దన్నుఁ బ్రేమ నన్నవారి దిగనాడి
వున్నతమైన చోట నుండఁబోయి
తన్నుఁ దా వేంకటపతిదాసులఁ జేరి వాఁడు
యెన్నఁడుఁ దిరిగి రాఁడే యెటువంటి జాణే
॥వెట్టి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము