Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 29-2
సంపుటము: 1-177
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ
వొడ్డిన భవము దన్ను [1]వొడ కమ్ముఁ గాక
॥గడ్డపార॥
చించుక మిన్నులఁ బారేచిలకలను బండిఁ గట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు
పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁ గాక
॥గడ్డపార॥
మంటమండే యగ్గి దెచ్చి మసిపాఁత మూఁట గట్టి
యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుఁ జేసి ఆసలనే పారఁదోసుఁ గాక
॥గడ్డపార॥
పట్టరాని విషముల పాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని
వట్టిమనుజుల పెడవాడఁ బెట్టుఁ గాక
॥గడ్డపార॥

[1] ‘ఒడ్ల’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము