అధ్యాత్మ సంకీర్తన
రేకు: 29-3
సంపుటము: 1-178
రేకు: 29-3
సంపుటము: 1-178
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| కటకటా దేహంబు గాసిఁ బెట్టఁగవలసె నిటువంటి దెసలచే నిట్లుండవలసె | ॥కటకటా॥ |
| చంపనొల్లక కదా సంసారమనియెడి గంపమోఁపు గడించె కర్మసంగ్రహము లంపటము విరియించ లావుచాలక తుదిని దింప నొకకొంతైన తెగుదెంపులేదు | ॥కటకటా॥ |
| మనుపనోపక కదా మాయావిలంబమున కనుమూసి కాంక్ష మఱి కట్టె దైవంబు దినభోగములు విడువఁ దెఱఁ గేమిటను లేక తనివిఁ బొందించ నెంతయు వసముగాదు | ॥కటకటా॥ |
| తెలుపనోపక కదా తిరువేంకటేశ్వరుఁడు వెలలేని వేదనల వేఁచెఁ బ్రాణులను బలిమి నజ్ఞానంబుఁ బాయలే కితనినే [1]తలఁచి భవబంధముల దాఁటంగరాదు | ॥కటకటా॥ |
[1] ‘తలఁచికాని’ అని అర్థము కావచ్చు.


