Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 29-4
సంపుటము: 1-179
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి
॥అయ్యో॥
చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక [1]వృథా పిరివీకులైతి
॥అయ్యో॥
తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించలేక చింతాపరుఁడనైతి
॥అయ్యో॥
అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంతకూటముల యలజడికి లోనైతి
॥అయ్యో॥

[1] ‘వ్రిథా’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము