Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 3-5
సంపుటము: 1-18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద
వెలుఁగు లోపలికి వెలుఁగేలా
॥తెలియ॥
అరయ నాపన్నుని కభయ మీవలెఁ గాక
ఇరవైన సుఖిఁ గావనేలా
వఱతఁ బోయెడివాని వడిఁ దీయవలెఁ గాక
దరివానిఁ దివియంగఁ దానేలా
॥తెలియ॥
ఘనకర్మారంభుని కట్లు విడవలెఁ గాక
యెనసిన ముక్తునిఁ గావనేలా
అనయము దుర్బలుని కన్నమిడవలెఁ గాక
తనసినవానికిఁ దానేలా
॥తెలియ॥
మితిలేని పాపకర్మికిఁ దా వలెఁ గాక
హితవెఱుఁగు పుణ్యునికేలా
ధృతిహీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడు
తతిఁ గావకుండినఁ దానేలా
॥తెలియ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము