Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-2
సంపుటము: 1-2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
వేదవేద్యులు వెదకేటి మందు
ఆది నంత్యములేని‌ ఆ మందు
॥వేద॥
అడవిమందులుఁ గషాయములు నెల్లవారు
కడగానక కొనఁగాను
తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
నడియాలమైనట్టి ఆ మందు
॥వేద॥
లలితరసములుఁ దైలములు నెల్లవారు
కలకాలము గొనఁగాను
చెలువైన దొకమందు చేరె మాకు భువి-
నలవి మీఱినయట్టి యా మందు
॥వేద॥
కదిసిన జన్మరోగముల నెల్లవారు
కదలలేక వుండఁగాను
అదన శ్రీతిరువేంకటాద్రిమీఁది మందు
అదివో మా గురుఁడిచ్చె నా మందు
॥వేద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము