Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 32-7
సంపుటము: 1-201
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చు
కందువెఱిఁగి చీఁకటి దవ్వుకొనుఁ గాక[1]
॥ఎందరి॥
తల రాయిగాఁగ నెందరికి మొక్కెడిని
తెలివిమాలినయట్టి దేహి
కొలఁదిమీరిన దేవకోట్లు దనలోన
కలవాని నొక్కనినే కొలుచుఁ గాక
॥ఎందరి॥
కాలీచపడఁగ నెక్కడికి నేఁగెడిని
పాలుమాలినయట్టి ప్రాణి
మేలిమిజగములు మేనిలోఁ గలవాఁడు
పాలిటివాఁడై ప్రణుతికెక్కుఁ గాక
॥ఎందరి॥
నూరేండ్ల[2] నెందరి నుతియింపఁ గలవాఁడు
చేరఁ దావులేని జీవి
శ్రీరమణీశుఁడు శ్రీవేంకటేశుని
కోరికెఁ దలఁచి నుతి[3] కొల్లగొనుట గాక
॥ఎందరి॥

[1] నిడురేకు 47- జీఁకటికిఇ దొలగుఁ.

[2] నిడురేకు 47- నోరెండ

[3] నిడురేకు 47- ముక్తి.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము