అధ్యాత్మ సంకీర్తన
రేకు: 33-1
సంపుటము: 1-202
రేకు: 33-1
సంపుటము: 1-202
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు- నెన్ని వలసినను దమయేలెటివే[1] కావా | ॥వెన్న॥ |
| తలఁపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు కలుగుటే కలుగువలెఁ గాక వలనైన భోగములు వైభవంబులు మరియు కలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా | ॥వెన్న॥ |
| పదిలముగ హరినామపఠన[2] మంత్రము నోరు కదియుటే కలుగవలెఁ గాక తుదలేని సంపదలు తొలగని ముదంబులును కదలకెప్పుడుఁ దమకు గలిగినవె [3]కావా | ॥వెన్న॥ |
| యించుకైనను వేంకటేశు గిరిశిఖరంబు కాంచుటే కలుగవలెఁ గాక అంచితంబైన నిత్యానందపదవులను మించి తమ యెదుటఁ బ్రభవించినవె కావా | ॥వెన్న॥ |
[1] నిడురేకు 34- యెదిటివే.
[2] పరమ మంత్ర.
[3] ‘కాక’ రేకు.


