Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 33-4
సంపుటము: 1-205
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
చాలదా హరిసంకీర్తనం గల
మే లిది దీననే మెరసిరి ఘనులు
॥చాలదా॥
తలఁప వేదశాస్త్రములు గానక
అలరుచు [1]వాల్మీకాదులు
తలకొని హరిమంత్రమే దగఁ బేర్కొని
అలవిమీరఁ గడు [2]నధికములైరి
॥చాలదా॥
యితరదైవముల నెఱఁగనేరక
ప్రతిలేని మహిమఁ బార్వతి
మతిఁ దలఁపుచు హరిమంత్రమె పేర్కొని
సతతము హరులో సగమై నిలిచె
॥చాలదా॥
చదువులుఁ బలుమరుఁ జదువనోపక
అదివో నారదాదులు
పదిలపు వేంకటపతి హరినామమే
వదల కిదియ జీవనమై మనిరి
॥చాలదా॥

[1] ‘వాల్మీక్యాదులు’ కావచ్చునేమో.

[2] ‘నధికులునైరి’ కావచ్చునేమో.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము