Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 33-5
సంపుటము: 1-206
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
పోయఁబోయఁ గాలమెల్ల [1]పూఁటవూఁటకు
చేయి నోరు నోడాయ చెల్లఁబో యీరోఁతలు
॥పోయ॥
తిప్పన తొప్పన కేతు[2] దేవన బావన గన్ను[3]
పప్పన బొప్పనగారి బాడిపాడి
కుప్పలుఁదెప్పలు[4]నైన కోరికెలు మతిలోన
యెప్పుడుఁ బాయకపోయ నెన్ని లేవు రోఁతలు
॥పోయ॥
కాచన పోచన మాచు[5] కల్లప బొల్లప మల్లు
బాచన దేచనగారిఁ బాడిపాడి
యేచిన పరసుఖము నిహమును లేకపోయ
చీచీ విరిగితిమి చెప్పనేల రోఁతలు
॥పోయ॥
బుక్కన తిక్కన చెల్లు బూమన కామన పేరి-
బక్కల నిందరి నోరఁ బాడిపాడి
యెక్కువైన తిరువేంకటేశునిఁ దలఁచలేక
కుక్కకాటుఁ జెప్పుటా(టే?)టై కూడె నిన్ని రోఁతలు
॥పోయ॥

[1] పూఁట + పూఁట = ‘పూఁటవూఁట’.

[2] నిడురేకు 61- మాచు.

[3] నిడురేకు 61- గంగు.

[4] నిడురేకు 61- దిప్పలు.

[5] నిడురేకు 61- కేతు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము