Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 33-6
సంపుటము: 1-207
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
పటుశిష్టప్రతిపాలకుఁడ వనఁగ
ఘటన నఖిలమును గాతువుగా
॥పటు॥
తుత్తుమురుగ దైత్యుల దనుజుల నని
మొత్తి మోఁది చలమునఁ జెలగి
జొత్తుపాపలుగ సొరిది విరోధుల
నెత్తురు వడుతువు నీవేకా
॥పటు॥
తళతళ మెఱుచు సుదర్శనాయుధం-
బలరుచు నొకచే నమరఁగను
బలుదైత్యుల దొబ్బలుఁ బేగులు నని
నిలువునఁ జెండుదు నీవేకా
॥పటు॥
దిట్టవు సూత్రవతీపతి వసురలఁ
జట్టలు చీరఁగఁ జతురుఁడవు
రట్టడి వేంకటరమణుని వాకిటి
పట్టపు సేనాపతివటకా
॥పటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము