Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 34-1
సంపుటము: 1-208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
పోయఁ బోయఁ గాలమెల్ల పూఁట వూఁటకు[1]
రోయని రోఁతలు చూచి రుచి చూరఁబోయ
॥పోయ॥
తాడిమానెక్కేటివాని తడయక పట్టివట్టి
తోడఁదోడ నెందాఁకాఁ దోయవచ్చును
కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే
ఆడికెలకులోనై[2] తనియక[3] పోయ
॥పోయ॥
మన్ను దినియేటి దూడ మానుమంటా మొత్తిమొత్తి
కన్నిగట్టి యెందాఁకఁ గాయవచ్చును
సన్నపుటాసలమీఁది చరిఁబడ్డ దేహమిది
కన్నపుఁ గత్తులచూపు కట్టరాకపోయ
॥పోయ॥
హేయము దొక్కకుమన్న యేచి తినేననేవాఁడు
చాయకు రాకున్న నేమిసేయవచ్చును
మాయలవేంకటపతి మచ్చుచల్ల నాయాత్మ
పాయక యాతనిఁ జేరి భయమెల్లఁ బోయ
॥పోయ॥

[1] నిడురేకు 83- పోయెఁ దా యీ కాలమెల్ల పొద్దు వొద్దుకు.

[2] ఇందు ‘నై త’ అను నక్షరముల నడుమ మరి రెండక్షరములు చెక్కి తరువాత రాచి చెఱిచినట్లున్నది. ఛందోరీతి నూహించి చూడఁగా, నై-య అను రెంటిలో ఏది యతిస్థానముగాఁ గిన్నను రెండక్షరములు కావలయునేమో అనిపించుచున్నది.

[3] తనియకే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము