Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 34-2
సంపుటము: 1-209
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
పాపమెరంగని బ్రాహ్మఁడు | యెందుఁ
జూపరానిచోటు చూపీనయ్యా
॥పాప॥
తనివోక [1]జీవముతలకాయ నంజుడు
పనివడి తిని తిన్న బ్రాహ్మఁడు,
యెనసి యెదిరిఁ దన్ను నెఱఁగక విభుఁడై
ఘనవంశము మంటఁ గలపీనయ్యా
॥పాప॥
యెవ్వారు నెఱఁగని యెముకల యింటిలో
పవ్వళింపుచునున్న బ్రాహ్మఁడు,
జవ్వనమదమున జడిసేటి కోమలిఁ
బువ్వులతోఁటలోఁ బొదిగీనయ్యా
॥పాప॥
చెలఁగి కన్నెరికము చెడని పడుచుఁ దెచ్చి
పలువేదనలఁ బెట్టే బ్రాహ్మఁడు,
తెలిసి వేంకటాధిపుని దాసుఁడై
పులుగు పంజరానఁ[2] బొదిగీనయ్యా
॥పాప॥

[1] జీవము = మేక మొదలగు జంతువు అని మాండలికము. ‘నావి నాళుగు జీవాలు తప్పిపోయినవి’ ఇత్యాది వ్యవహారముకూడ కలదు.

[2] నిడురేకు 88- పంజరము వుదికీనయ్యా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము