Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 34-4
సంపుటము: 1-211
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎటువంటి రౌద్రమో యెటువంటి కోపమో
తటతట నిరువంక దాఁటీ వీఁడే[1]
॥ఎటు॥
తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచి
దారుణలీలఁ బెదవు లవుడుకఱచి
కారించి చాణూరుఁ గడుభంగపఱచి
వీరుఁడై యెముకలు విఱచీ వీఁడే
॥ఎటు॥
పిడుగడచినయట్టు పెడచేత నడిచి[2]-
పడనీక పురములోపలఁ జొరఁబొడిచి
తొడిచి చాణూరు నెత్తుక దయవిడిచి
వడివెట్టి నెత్తురు వడిచీ వీఁడే
॥ఎటు॥
బుసకొట్టుచును వూరుపులఁ జెమరించి
మసిగాఁగ బెదపెదమల్లుల దంచీ-
నెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించి
ముసిముసినవ్వుల ముంచీ వీఁడే
॥ఎటు॥

[1] నిడురేకు 48- కడపటి చరణములో మాత్రము ‘వీఁడే’ తక్కినచోట్లనెల్ల ‘వాఁడే’.

[2] ‘చీఁ-బడ’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము