Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 34-6
సంపుటము: 1-213
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
తన కర్మమెంత చేఁతయు నంతే
గొనకొన్న పని యంత కూలీ నంతే
॥తన॥
తలఁపులో హరి నెంత దలఁచె నేఁడే వాని
కలిమియు సుఖమును గల దంతే
తులఁదూఁచఁ బైఁడెంత తూఁకము నంతే
నెలకొన్న పిండెంత నిప్పటీ నంతే
॥తన॥
సిరివరు పూజెంత సేసె నేఁడే వాని
దరియును దాపు నెంతయు నంతే
పురిగొన్న యీవెంత పొగడూ నంతే
నరపతి చనవెంత నగవూ నంతే
॥తన॥
శ్రీవేంకటపతి చింత యంత[1] నేఁడే
భావపరవశము పలుకూ నంతే
దైవము కృప యంత తానూ నంతే
యేవంక జయమెంత యిరవూ నంతే
॥తన॥

[1] ‘యంతే’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము