Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 35-2
సంపుటము: 1-215
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవు గాక
బందెపసురమవైతి బాపు జీవుఁడా
॥ఇందు॥
తోలుబొక్కలోనఁ జొచ్చి తూలేటిఁ యాకలిచేత
పాలుమాలి యిందరికి బంటుబంటవై
యేలినవానిఁ గానక యేచిన యాసల వెంట
కూలికిఁబో దొరకొంటి కూళజీవుఁడా
॥ఇందు॥
తీఁటమేనిలోనఁ జొచ్చి దిమ్మరిదొంగలచేత
మూఁటగట్టించుక[1] నీవు మూలదొరవై
గాఁటపువిభుని చేతిఘనత కోరికలకు
వేఁటకుక్కవైతివి వెఱ్ఱిజీవుఁడా
॥ఇందు॥
చీమలింటిలోనఁ జొచ్చి చిక్కువడి అందరిలో
దోమకరకుట్లకు తోడిదొంగవై
యేమరి వేంకటవిభు నెఱఁగక జాడుఁజొప్ప
నాము మేయ దొరకొంటి నాలిజీవుఁడా
॥ఇందు॥

[1] నిడురేకు99- గడించుక.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము