Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 35-4
సంపుటము: 1-217
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
వెరపులు నొరపులు[1] [2]వృథా వృథా
ధరపై మరి యంతయును వృథా
॥వెరపు॥
తడయక చేసిన దానంబులు వృథ
యెడనెడ నెఱిఁగిన యెఱుక వృథా
వొడలిలోని హరి నొనరఁగ మతిలోఁ
దడవని జీవమె తనకు వృథా
॥వెరపు॥
జగమునఁ బడిసిన సంతానము వృథ
తగిలి గడించిన ధనము వృథా
జగదేకవిభుని సకలాత్ముని హరిఁ
దెగి కొలువని బుద్ధియును వృథా
॥వెరపు॥
పనివడికూడిన పరిణామము వృథ
వొనరఁగనుండిన వునికి వృథా
ఘనుఁడగు తిరువేంకటగిరిహరిఁ గని
మననేరని జన్మములు వృథా
॥వెరపు॥

[1] నిడురేకు 16- మరపులు.

[2] ‘వ్రిథా వ్రిథా’ అంతటా రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము