Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 35-6
సంపుటము: 1-219
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
హరినెఱఁగని పుణ్య మంటేరు గాన
దురితాలే దురితాలే దురితాలే సుండీ
॥హరి॥
దొడ్డపుణ్యములు సేసి తుదలేని సంపదలు
అడ్డగించుకొని రాసులగు గురుతు
జడ్డులేని హరికథ చవిలేకుండిన నిట్టే
గొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుండీ
॥హరి॥
వలెనని మేలెల్ల వడిఁజేసి కైవల్య-
మలమి చేతికిలోననగు[1] గురుతు
తలఁపు వైష్ణవభక్తిఁ దగులకుండిన నంతా
అలయికే అలయికే అలయికే సుండీ
॥హరి॥
తిరమైన తీర్థాలు దిరిగి యందరిలోన
ధరఁ బుణ్యఁడవుట యంతకు గురుతు
తిరువేంకటపతిఁ దెలియకుండిన నంతా
విరసాలే విరసాలే విరసాలే సుండీ
॥హరి॥

[1] నిడురేకు 34- చేకొనిలోనగు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము